Thursday, October 3, 2024
HomeUncategorizedఢిల్లీలో శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ

ఢిల్లీలో శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ

Date:

తొలిసారి ఓ శునకానికి ఢిల్లీకి చెందిన ప్రయివేటు వెటర్నరీ వైద్యులు అరుదైన హార్ట్ సర్జరీ నిర్వహించారు. సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఆ శునకానికి కోతలేకుండానే సర్జరీ నిర్వహించారు. ఏడేళ్ల వయసున్న జూలియట్‌ అనే శునకానికి ఈ సర్జరీ చేశారు. గత రెండేళ్లుగా జూలియట్ మైట్రల్‌ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. వయసు పెరగడంతోపాటు వచ్చే క్షీణతల వల్ల జంతువుల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. శునకాలకు వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80 శాతం కాగా.. దీనివల్ల గుండె ఎడమ ఎగువ భాగంలో రక్తప్రవాహం వెనక్కి వస్తుంది.

ఈ వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగి క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడుతోన్న జూలియట్‌కు ఢిల్లీలోని మ్యాక్స్‌ పెట్జ్‌ హాస్పిటల్ నిపుణులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ట్రాన్స్‌కెథతర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపెయిర్‌ (టీఈఈఆర్‌) అనే ప్రక్రియ ద్వారా ఈ చికిత్స చేపట్టారు. ఎటువంటి కోత అవసరం లేకుండా రక్తనాళం ద్వారా ఒక సాధనాన్ని పంపి లోపాన్ని సరిచేశారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను పూర్తిచేయడం మరో విశేషం. మే 30న జూలియట్‌కు శస్త్రచికిత్సను నిర్వహించగా.. రెండు రోజుల అనంతరం డిశ్ఛార్జి చేశారు.

ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భాను దేవ్ శర్మ మాట్లాడుతూ.. దీనిని హైబ్రిడ్ సర్జరీ విధానం అంటారని తెలిపారు.‘ఈ ప్రక్రియలో ఉత్తమమైన ప్రక్రయి ఏమిటంటే, ఇది గుండె కొట్టుకునే ప్రక్రియ, ఊపిరితిత్తుల బైపాస్ అవసరమయ్యే ఓపెన్ హార్ట్ సర్జరీ మాదిరి కాకుండా ముప్పు చాలా తక్కువ’ అని తెలిపారు. ఈ విధానాన్ని తాము రెండేళ్ల కిందట అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీని సందర్శించినప్పుడు ఈ సర్జరీ విధానం గురించి తెలుసుకున్నామని చెప్పారు.