భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏకవచనంతో మాట్లాడిన మాటలకు విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఏకవచనంతో ప్రసంగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై ట్వీట్ చేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఏకవచనంతో సంబోధించిన సిద్ధరామయ్యను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. రాజకీయంగా, ఎస్సీ, ఎస్టీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేసి ఆయన మాట్లాడిన మాటలకు విచారం వ్యక్తం చేశారు.
చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య ఆవేశంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అణగారిన వారి కోసం ఏర్పాటు చేసిన సదస్సులో సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి మాట్లాడుతూ ఆమెను ఏకవచనంతో సంభోదించడం కలకలం రేపింది. బీజేపీ నాయకులకు యోగ్యత లేదని సిద్దరామయ్య మండిపడ్డారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, అణగారిన సమాజానికి చెందిన ఆమెను కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించేందుకు పిలవలేదని, అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయ ప్రారంభోత్సవానికి పిలవలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఏకవచనంతో మాట్లాడటంపై మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రసంగానికి సంబంధించిన వీడియోలను వరుసగా ట్వీట్ చేసిన కుమారస్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధించిన సిద్ధరామయ్యను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ని డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ రాష్ట్రపతిని ఏకవచనంతో మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు.