Wednesday, October 2, 2024
HomeUncategorizedచెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలు

చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలు

Date:

చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిపాల వ్యాపారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిషేధం ఉన్నప్పటికీ.. కొంతమంది అక్రమంగా ఈ దందాను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై మహానగరంలోని మాధవరంలో ముత్తయ్యకు చెందిన ఓ వ్యాక్సిన్‌ స్టోర్‌పై దాడి చేసిన ఉన్నతాధికారులు తల్లి పాలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రోటీన్‌ పౌడర్‌ విక్రయానికి లైసెన్స్‌ తీసుకుని ఆ ముసుగులో తల్లిపాలను విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. 50 బాటిళ్ల తల్లిపాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆ బాటిళ్లను గిండీలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌కు పంపించారు. ముత్తయ్య తల్లిపాలను ఎలా సేకరించాడు? ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తల్లి పాలను దానం చేసే మహిళల పేర్లు, ఫోన్‌ నంబర్లతో కూడిన ఓ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌బుక్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.

తల్లిపాల విక్రయాలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిషేధం విధించిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. తల్లిపాలను దీర్ఘకాలం నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. అలాగే తల్లిపాలలో ఉండే సహజ ప్రోటీన్లు కూడా నశిస్తాయని పేర్కొన్నారు. అందుకే తల్లిపాలను నిల్వ చేసి అమ్మడాన్ని నిషేధించారని వివరించారు.