Wednesday, October 2, 2024
HomeUncategorizedపోలీసులపై దాడి చేసిన ఇండియన్‌ ఆర్మీ

పోలీసులపై దాడి చేసిన ఇండియన్‌ ఆర్మీ

Date:

ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)తోపాటు ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో సంబంధమున్న 16 మంది ఆర్మీ సిబ్బందిపైనా కేసు నమోదైంది. వీరిలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయి అధికారులు ముగ్గురు ఉన్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బాత్పొరా గ్రామంలో నివసిస్తున్న సైనికుడి ఇంట్లో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన సైనికాధికారులు తమ సిబ్బందితో కలిసి అదేరోజు రాత్రి 9.30 సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గలాటా సృష్టించారు. అక్కడున్న సిబ్బందిపై భౌతిక దాడికి దిగారు. పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు ఆర్మీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులు, ఆర్మీ మధ్య ఎలాంటి భౌతిక దాడి జరగలేదని రక్షణశాఖ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. స్థానిక ఆర్మీ యూనిట్‌కు, పోలీసులకు మధ్య కార్యాచరణ పరమైన విభేదాలు తలెత్తిన మాట వాస్తవమేని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నామని తెలిపారు.