Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంలంచం తీసుకున్న అధికారికి ఉరిశిక్ష విధించారు..

లంచం తీసుకున్న అధికారికి ఉరిశిక్ష విధించారు..

Date:

ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. లంచం తీసుకున్న ఓ బ్యాంక్ అధికారికి మరణిశిక్షను విధించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. 

చైనాలో అవినీతికి పాల్పడే అధికారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో లంచాలు తీసుకున్న కేసులో ఓ బ్యాంక్ మాజీ ఆఫీసర్ దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని రుజువయ్యాయి. దీంతో అతడికి మరణ శిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరో విషయమేమంటే అదే బ్యాంకుకు చెందిన ఓ ఉన్నతాధికారికి కూడా మూడేళ్ల క్రితం ఇదే కోర్టు మరణశిక్షను విధించింది.

చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనేది చైనా హువారోంగ్ అసెట్ మేనేజిమెంట్ ఆఫ్ షోర్ కంపెనీ. ఇందులో బెయ్ తియాన్ హుయ్ అనే వ్యక్తి గతంలో జనరల్ మేనేజర్ గా పని చేశాడు. ఆ సమయంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక ప్రాజెక్టులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, ఈ ప్రాజెక్టుల మాటున భారీ స్థాయిలో నగదు చేతులు మారిందని వెల్లడైంది. మొత్తం రూ. 1264 కోట్ల వరకు లంచం రూపంలో ఆయన తీసుకున్నట్లు రుజువు అయ్యింది. ఈ కేసు విషయమై విచారణ చేపట్టిన కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై అతను అప్పీల్ కు వెళ్తాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, మరణశిక్ష నుంచి బయటపడడం కష్టమని స్థానికంగా చర్చ నడుస్తోంది.

చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ ఆ దేశంలో అవినీతి వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చాలామంది అవినీతికి పాల్పడిన అధికారులు పట్టుబడ్డారు. 2021 జనవరి నెలలో ఓ వ్యక్తికి మరణశిక్షను విధించింది. మరుసటి నెలలో అతడికి ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే.