Wednesday, October 2, 2024
HomeUncategorizedవెయ్యి  రూపాయల బిర్యానికి ఆసుపత్రిలో లక్ష బిల్లు

వెయ్యి  రూపాయల బిర్యానికి ఆసుపత్రిలో లక్ష బిల్లు

Date:

పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులు సరదాగా వెళ్లి మండి బిర్యాని తిన్నారు. హోటల్‌లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారి తీసింది. ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకుని ఆస్పత్రిలో చేరారు. వాళ్లు తిన్న వెయ్యి రూపాయల బిర్యానీకి ఆస్పత్రిలో లక్ష రూపాయలు కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

షాద్‌నగర్‌ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో కావలి నరేందర్‌ నివసిస్తున్నాడు. ఈ నెల 22న తన పెళ్లి రోజు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మండి బిర్యాని తిన్నారు. కాసేపు అక్కడే సరదాగా గడిపి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వెళ్లాక ఒకరి తర్వాత అస్వస్థతకు గురయ్యారు. అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో నరేందర్‌తో పాటు అతని భార్య మంగమ్మ, కుటుంబసభ్యులు దీక్షిత, తన్విక, అనిరుధ్‌, అభిలాష్‌, జ్యోత్స్న, సాయి శ్రీకర్‌ సహా మొత్తం ఎనిమిది మందిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారందరూ అక్కడే చికిత్స పొందుతున్నారు. వీరిలో రేందర్‌కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాగా, వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కలుషిత ఆహారం తినడం వల్లే అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి రూపాయలు ఖర్చు చేసి బిర్యాని తింటే.. ఆస్పత్రిలో లక్ష రూపాయల బిల్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.