Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంఎవరెస్టు పర్వతారోహణలో పోతున్న ప్రాణాలు

ఎవరెస్టు పర్వతారోహణలో పోతున్న ప్రాణాలు

Date:

ఎవరెస్టు శిఖరానని అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యాటకులు రోజురోజుకు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు.

బాన్షీలాల్‌ (46) అనే భారతీయ పర్వతారోహకుడు గతవారం ఎవరెస్టు మార్గంలో చిక్కుకుపోయాడు. అతన్ని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. కాఠ్‌మాండూలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు నేపాల్‌ పర్యటక శాఖ పేర్కొంది. ఇలా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు నేపాలీ షెర్పాల(గైడ్లు) ఆచూకీ లభించకపోవడంతో వారూ మరణించినట్లుగానే భావిస్తున్నారు. అయితే, మునుపటితో పోలిస్తే ఈసారి ఎవరెస్టులో మరణాల సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది మృతుల సంఖ్య 18గా నమోదైంది.