రైతుల అభివృద్దే మా ధ్యేయం, తెలంగాణలోని అన్నదాతలకు ఏలాంటి కష్టాలు రాకుండా ఇరవై నాలుగు గంటలు రైతుల శ్రేయస్సు కోసమే పని చేస్తున్నామని చెపుతున్న తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకు ఏం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది యూత్ ఫర్ యాంటీ కరప్షన్..
ముందడుగు ప్రత్యేకం:
తెలంగాణ రాష్ట్రంలో రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా, వారి అభివృద్ది కోసం చేసిన పథకాలు, వ్యవసాయ పనిముట్లను, ట్రాక్టర్లను, ఎంతమందికి, ఎంత సబ్సిడీ కింద చెల్లించారో తెలపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఇచ్చిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 16431 ట్రాక్టర్లను అందజేసినట్లు జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని ట్రాక్టర్లను అందజేశారో వివరాలను ఇచ్చారు. అందుకు 5546403888 నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.
రైతుల అభివృద్ది కోసం ట్రాక్టర్లను అందించాలనే ప్రభుత్వం ఆలోచన బాగానే ఉంది కాని, అసలు ట్రాక్టర్లు ఎంతమంది వ్యవసాయమే పరమావధిగా పనిచేసే అన్నదాతలకు ఇచ్చారో అంటే సమాధానం లేదు. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు ఎక్కువమంది నాయకుల బినామీలే తీసుకొని వాటిని దుర్వినియోగ పరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ట్రాక్టర్లు తీసుకున్న రైతుల పేర్లు అడిగామని, పేర్ల జాబితా రాగానే జిల్లాల వారీగా సర్వే చేసి ట్రాక్టర్లు తీసుకున్న వారిలో ఎంతమంది రైతులో, ఎంతమంది బినామీలో బయటపెడతామని రాజేంద్ర తెలిపారు.
*జిల్లాల వారీగా పంపిణీ చేసిన ట్రాక్టర్లు*
ఆదిలాబాద్లో 408, కొత్తగూడెంలో 174, హన్మకొండలో 407, జగిత్యాలలో 534, జనగామలో 465, భూపాలపల్లిలో 406, గద్వాలలో 198, కామారెడ్డిలో 198, కామారెడ్డిలో 803, కరీంనగర్ లో 1146, ఖమ్మంలో 1046, ఆసిఫాబాద్ లో 187, మహబూబాబాద్ లో 519, మహబూబ్ నగర్ లో 698, మంచిర్యాలలో 224, మెదక్ లో 323, మేడ్చల్ లో 41, నాగర్ కర్నూలులో 403, నల్లగొండలో 927, నిర్మల్ లో 478, నిజామాబాద్ లో 1761, పెద్దపల్లిలో 312, సిరిసిల్లలో 823, రంగారెడ్డిలో 361, సంగారెడ్డిలో 697, సిద్దిపేటలో 697, సూర్యాపేటలో 501, వికారాబాద్ లో 369, వనపర్తిలో 274, వరంగల్ లో 274, యాదాద్రి భువనగిరిలో 926 వంతున మొత్తం 16,431 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. దీనికి గాను రూ.554.64 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ యంత్ర లక్ష్మి పథకం కింద వ్యవసాయ యాంత్రీకరణ నడుస్తుంది. ఇందులో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి 50 శాతం సబ్సిడీతో పాటు 50 శాతం రీమింగ్ కోసం రుణాన్ని అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ ధరలో 50 శాతం అందిస్తుంది. మిగిలిన డబ్బు కోసం రైతులు జాతీయ బ్యాంకుల నుంచి రుణం పొందొచ్చు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తున్నది.