స్కాలర్‌షిప్ పొందేందుకు సహాయం చేస్తానని ఒక వ్యక్తి వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్‌గా విద్యార్థినులతో మాట్లాడి మోసం చేశాడు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రజేష్ కుష్వాహా నిరక్షరాస్యుడు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేశాడు.
తన వాయిస్ మార్ఫింగ్ చేసే యాప్‌ను బ్రజేష్ వినియోగించాడు. మహిళా ప్రొఫెసర్ గొంతుతో గిరిజన కాలేజీ విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్‌షిప్ పొందేందుకు సహాయం చేస్తానని వారిని నమ్మించాడు. తాను పంపే వ్యక్తిని కలవాలని చెప్పాడు. అనుచరులు తీసుకువచ్చిన ఆ విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఒక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు హెల్మెట్ ధరించడంతో గుర్తించలేదని చెప్పింది. అయితే అతడి చేతికి గ్లౌవ్స్ ధరించినట్లు క్లూ ఇచ్చింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు బ్రజేష్ కుష్వాహా, అతడి ముగ్గురు సహచరులను శనివారం అరెస్ట్ చేశారు. గతంలో మహారాష్ట్రలోని మిల్లులో అతడు పని చేసినప్పుడు చేతులకు కాలిన గాయాలయ్యాయని, అందుకే అతడు గ్లౌవ్స్ ధరిస్తున్నాడని తెలిపారు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
నిందితుడు బ్రజేష్ కుష్వాహా మరింత మంది అమ్మాయిలను టార్గెట్ చేశాడా అన్నది దర్యాప్తు చేసేందుకు 9 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. సిద్ధి జిల్లా యంత్రాంగం బుల్డోజర్ ద్వారా బ్రజేష్ ఇంటిని కూల్చివేసింది.