Wednesday, October 2, 2024
HomeUncategorizedఐఐటీ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్

ఐఐటీ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్

Date:

ఐఐటీ చదువులకు ఉన్న క్రేజ్ వేరు. ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివితే, మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతనం లాంటి ప్యాకేజీలు అని చెపుతుంటారు. కాని మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ దక్కడం లేదు. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌సింగ్‌ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో దాదాపు 8వేల మంది (38శాతం) ఐఐటీయన్లకు ప్లేస్‌మెంట్స్‌ దక్కలేదని తేలింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసం నమోదు చేసుకోగా.. కేవలం 13,400 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్‌ సాధించారని.. మిగతా వారు (38శాతం) ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. రెండేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత తొమ్మిది ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ కోసం నమోదు చేసుకోగా.. వారిలో 6,050 (37%) మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్త 14 ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ప్లేస్‌మెంట్స్‌ కోసం నమోదు చేసుకోగా.. ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది కాన్పూర్‌ ఐఐటీ, ఖరగ్‌పుర్‌ ఐఐటీల్లో 33శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ దక్కలేదని ధీరజ్‌సింగ్‌ తన లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు.