ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం మద్యం నుంచే వస్తుంది. అందుకే ప్రజలకు ఎంత మద్యం తాగిస్తే అంత ఆదాయం అంటూ సంబంధిత మద్యం శాఖ వారు ఇష్టానుసారంగా మద్యాన్ని మద్యం షాపులతో అమ్మిస్తుంటారు. దానికి తోడు ప్రతి చిన్న పల్లెలో సైతం అనధికార బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉంటాయి. ఆ బెల్టు షాపులు ఎక్కడున్నాయి, ఎవరు అమ్ముతున్నారనే విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా తమకేమి సంబంధం లేనట్టుగానే ఉంటారు. మంచినీళ్లు దొరకని గ్రామాల్లో కూడా బెల్టుషాపులు ఉంటాయనే సామెత గతంలోనే ఉంది. అలాంటిది అసలు తెలంగాణ పల్లెల్లో బెల్టుషాపులు ఉన్నాయా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ శాఖను ప్రశ్నించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపులు ఉన్నాయా, లేవా ఒకవేళ బెల్టు షాపులు ఉంటే ఏఏ జిల్లాలలో ఎన్ని షాపులు ఉన్నాయి. ఇప్పటివరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఎన్ని మద్యం షాపులపై రాష్ట్రవ్యాప్తంగా జరిమానా విధించారు. ఎన్ని షాపులను సీజ్ చేశారు తెలపగలరని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర తెలిపారు.
*రాష్ట్రంలో ఏ జిల్లాలో బెల్టుషాపుల్లేవ్..*
తాము అడిగిన ప్రశ్నకు ప్రతి జిల్లా ఎక్సైజ్ అధికారి సమాచారం పంపారు. రాష్ట్రంలోని పెద్దపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూల్, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిర్మల్, లక్ష్యెట్టిపేట, మంచిర్యాల, వరంగల్ రూరల్, బెల్లంపల్లి, అదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎక్సైజ్ అధికారులు తమ ప్రాంతంలో బెల్టులు నిర్వహించడం లేదు. ఎక్కడైనా బెల్టులు షాపులు ఉన్నాయని సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇచ్చారు.
*వేలాది మందిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ*
తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని చెప్పిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ కేసులు మాత్రం వేలల్లో నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చింది. ఇంతమంది అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలిసి దాడులు చేసి కేసులు నమోదు చేసిందా, లేదా టార్గెట్ కోసం కేసులు నమోదు చేసిందో మాత్రం అర్థమే కావడం లేదు.
2020 సంవత్సరంలో 2,762 కేసులు, 2021 సంవత్సరంలో 2,066 కేసులు, 2022 సంవత్సరంలో 1.742 కేసులు, 2023 సంవత్సరంలో జూలై 31వరకు 843 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. మొత్తం ఈ నాలుగేళ్లలో 7413 కేసులు రాష్ట్రంలో నమోదు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ శాఖ పిఐఓ సమాచారం ఇచ్చినట్లు సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఇన్ని కేసులు ఎందుకు నమోదు చేశారో మాత్రం తెలపలేదని అన్నారు.