Wednesday, October 2, 2024
HomeUncategorizedఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

Date:

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఐఐటీల్లో చేరాలంటే కఠినమైన జేఈఈ, గేట్ పరీక్షలు రాయాలి. వీటిలో టాప్ స్కోర్ సాధించిన వారికే ప్రధాన సంస్థల్లో అడ్మిషన్ వస్తుంది. అయితే, ఐఐటీల్లో చదువుకోవడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని. ఫీజులు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీంతో అన్ని అర్హతలు ఉండి కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి నిరాశే మిగులుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఐటీ కాన్పూర్ వివిధ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

* మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్

ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.50 లక్షలు లోపు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. దీనికి సెలక్ట్ అయిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ప్రతి నెల రూ.1,000 విద్యార్థుల ఖాతాల్లో జమవుతుంది.

* ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 10 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులు ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు. ఈ స్కీమ్‌కి ఎంపికైతే విద్యార్థులకు ఏటా రూ.30 వేల స్టైఫండ్ అందుతుంది. దీంతో పాటు ప్రతి సెమిస్టర్‌కు రీసెర్చ్ కోసం రూ.20 వేలు ఇస్తారు.

* ఫ్రీ బేసిక్ మెస్ స్కాలర్‌షిప్

ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద విద్యార్థులకు బేసిక్ మెస్ బిల్లుపై మినహాయింపు లభిస్తుంది. రూ.4.5 లక్షల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు దీనికి అర్హులు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం అయ్యే ఫుడ్, అకామడేషన్‌ ఖర్చులను ఈ స్కాలర్‌షిప్ భరిస్తుంది.

* స్పోర్ట్స్ స్కాలర్‌షిప్

స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. ఐఐటీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ని లీడ్ చేసే వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెల రూ.1000 స్టైఫండ్ అందుతుంది. సంవత్సరం పాటు ప్రతి నెల ఈ మొత్తం స్టూడెంట్ ఖాతాలో జమవుతుంది.

* డోనార్ స్కాలర్‌షిప్

ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ డోనార్ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. వివిధ విభాగాల్లో సంతృప్తికరమైన ప్రదర్శన ఉన్న విద్యార్థులు దీనికి సెలెక్ట్ అవుతారు.

* ప్రత్యేక కమిటీ

ఈ స్కాలర్‌షిప్స్ కోసం ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ఐఐటీలోని సెనేట్ స్కాలర్‌షిప్స్ అండ్ ప్రైజెస్ కమిటీ.. విద్యార్తుల స్కాలర్‌షిప్ ప్రాసెస్ నిర్వహిస్తోంది. ఐఐటీ కాన్పూర్ అందించే స్కాలర్‌షిప్‌లు, అవార్డులు, ప్రైజులకు అర్హత ఉన్న విద్యార్థులను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. స్టైఫండ్ కోసం ఏయే విద్యార్థులు అర్హులు, అప్లై చేసుకునే విధానం, ఎంపిక ప్రక్రియ, తదితర వివరాలు తెలుసుకోవడానికి సంస్థ వెబ్‌సైట్‌ iitk.ac.in చెక్ చేయవచ్చు.