Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంసింగపూర్ ను భయపెడుతున్న కరోనా వైరస్

సింగపూర్ ను భయపెడుతున్న కరోనా వైరస్

Date:

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ సింగపూర్లో విజృంభిస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25 వేల 900 కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ తెలిపారు. సింగపూర్లో కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉందని, ప్రజలు మాస్కులు ధరించాలని అయన అక్కడి వారికి సూచించారు.

కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి జరుగుతుందని, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒక్క వారం రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది అన్నారు. అంతేకాదు ఆసుపత్రులన్నీ అలర్ట్ కావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు.

నాలుగు వారాల్లోనే భారీగా కేసులు

ప్రస్తుతం విపరీతంగా ఉన్న ఉధృతి నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిత్యం 250 మంది వరకు ఆసుపత్రులలో చేరుతున్నారని పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సింగపూర్ దేశంలో కరోనా కొత్తవేవ్

ఏప్రిల్ చివరి వారంలో 13700 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపిన ఆయన, ప్రస్తుతం కరోనా కేసుల ఉధృతి తీవ్రంగా కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కొత్త వేవ్ ప్రారంభమైందని పేర్కొన్న సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ వేవ్ ను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో తీసుకోవలసిన చర్యలపై సమీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు.

రెండు కొత్త వేరియంట్ల ఉధృతి

కోవిడ్ బాధితులను ఆస్పత్రిలో చేర్పించే అవసరం లేకుండా, ఇంటి వద్ద నుండే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సింగపూర్ పౌరులు మరోమారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సింగపూర్లో కేపీ. 1, కేపీ .2 కరోనా వేరియంట్ కేసులు మూడింట రెండు వంతులు నమోదు అవుతున్నాయి అన్నారు. ఈ రెండు కరోనా వేరియంట్లు ఎక్కువ వ్యాప్తి చేయగలిగిన, మరింత తీవ్రమైన వ్యాధిని కలిగించే వేరియంట్లని సింగపూర్ ఆరోగ్య శాఖ ఇంకా నిర్ధారించలేదు. అయితే దీనివల్ల వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు. అందరూ అలెర్ట్ గా ఉండాల్సిన అవసరాన్ని తెలిపారు.