Wednesday, October 2, 2024
HomeUncategorizedఇక్కడ రైతులకు ఆవులను దత్తత ఇస్తారు

ఇక్కడ రైతులకు ఆవులను దత్తత ఇస్తారు

Date:

ప్రకృతి వ్యవసాయంలో ఓ మూత్రంతోపాటు, ఆవు పేడను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం తమ గోశాలలోని గోవులను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దేవస్థానంలోని గోవులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని మే నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆవులు కావలసినవారు తమ పొలానికి సంబంధించి పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, 100 రూపాయల స్టాంప్ పేపర్, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ జిరాక్స్, తమ కాంటాక్ట్ నెంబర్ తో ఆలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా నమోదు చేసుకున్న రైతులకు మే నెల 24 న గోశాలలోని ఆవులను రైతులకు దత్తత ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

గతంలోనూ ఆలయ గోశాలలో గో దత్తత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు 6వేల ఆవులను రైతులకు దత్తత ఇచ్చారు. ఇటీవల దేశవ్యాప్తంగా లంఫి స్కిన్ వ్యాధి రావడంతో గోవులను స్వీకరించడం, దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే వ్యాధి ప్రభావం తగ్గడంతో తిరిగి మరల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్వారకాతిరుమల దేవస్థానం గోశాలలో పుంగనూరు, కపిల, కాంక్రీట్, గిర్, ఒంగోలు, నిమారి, మైసూర్ జాతికి చెందిన ఆవులు, ఎద్దులు ఉన్నాయి.

వీటిని మాత్రం రైతులకు దత్తత ఇవ్వరు. ఎంపిక చేసిన దేశవాళీ, జెర్సీ జాతులకు చెందిన గోవులను మాత్రమే రైతులకు దత్తత ఇస్తారు. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల రైతులు గో దత్తత కార్యక్రమంలో పాల్గొనటానికి దేవస్థానం కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. దత్తత తీసుకున్న రైతులు ఆవులను సంరక్షిస్తూ వాటి ద్వారా వచ్చే గోమూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేసి నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు అందించడమే దత్తత ముఖ్య ఉద్దేశ్యమని ఆలయ అధికారులు చెబుతున్నారు.