కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటినే కూల్చేందుకు ముందుకు రావటం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేసింది. అధికారం చేతిలో ఉంటే ఆస్తులను కాపాడుకునే నాయకులు ఉన్న నేటి రోజుల్లో అధికారం ఉన్నప్పటికీ తనను నమ్మి తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రోడ్డు వెడల్పులో భాగంగా తన ఇంటిని కూల్చివేసి కామారెడ్డి ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో తాజా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరిపై అనూహ్యంగా విజయం సాధించిన వెంకట రమణారెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
ఎన్నికలలో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తనపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఆయన తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులలో ముందుగా తన ఇంటిని కూల్చివేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మిగతా వారికి మార్గదర్శకులయ్యారు.
రోడ్డు వెడల్పులో భాగంగా పాత బస్టాండు నుండి అడ్లూర్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. వెంకటరమణారెడ్డి ఇంటి నుండి పాత బస్టాండ్ వరకు రెండు సినిమా టాకీస్ లు మరియు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. వాటితో పాటు కొన్ని వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ అధికారులు నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు. అయితే వెంకటరమణ రెడ్డి తన ఇంటిని ఖాళీ చేసి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు ఈ క్రమంలో మకాం మార్చారు. వెయ్యి గజాల స్థలాన్ని రోడ్డు వెడల్పు చేయటం కోసం ఇచ్చారు. అందులో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు సహకరించారు. అందరి కంటే ముందుగానే తన ఇంటిని కూల్చివేసి ప్రజల కోసం తన మంచి మనసును చాటుకున్నారు