Wednesday, October 2, 2024
HomeUncategorizedగెలిస్తే మేము చెప్పిందే నిజం అంటారు

గెలిస్తే మేము చెప్పిందే నిజం అంటారు

Date:

జ్యోతిష్యాలను ఎంత వరకు నమ్మాలో, ఎంతవరకు నమ్మరాదో మాత్రం తెలియదు. మనిషి గ్రహస్థితిని బట్టి బాగా నమ్మేవాళ్లు లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు జ్యోతిష్యాలు రాజకీయంలో అడుగుపెట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కచ్చితంగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ కు కట్టబెడతారని, కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని చాలామంది జ్యోతిష్యులు యథేచ్ఛగా జోస్యాలు చెప్పారు. భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరూ నిజమే కాబోలు అనుకున్నారు. పేరున్న జ్యోతిష్యులంతా మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్నారు. ప్రజలు కూడా తమను కాకుండా ఇంకెవరికి ఓటు వేస్తారులే అనే ధీమాను కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తపరిచాయి. కానీ కేసీఆర్ మాత్రం గెలవలేదు, అసెంబ్లీలోకి రాలేదు.

ఎన్నికల ఫలితాలలో అతి తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, అంతకంటే తక్కువ అంచనా వేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సంఘటనను కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతవరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సభలో చూడాల్సి ఉంటుంది కాబట్టే కావాలనే రావడంలేదంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

ఇప్పుడు మళ్లీ ఆంధ్రా ఎన్నికల ఫలితాలపై మరికొందరు జ్యోతిష్యులు అప్పుడే ఫలితాలు చెబుతున్నారు. జాతక చక్రాలు పరిశీలించామని, ఎంతో క్షుణ్నంగా పరిస్థితులను అవగాహన చేసుకున్నామని, గ్రహాల స్థితిగతులు, వాటి బలాబలాలు అన్నింటినీ తెలుసుకొన్న తర్వాత వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి రాబోతున్నారని వీరంతా చెబుతున్నారు. మరికొందరు కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఇక్కడ ఎవరిదీ నమ్మాలో, ఎవరిదీ నమ్మకూడదో అర్థమే కావడం లేదు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి.. వైఎస్ జగన్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెటైర్లు పేలుస్తున్నాయి.

ఫలితాలు జ్యోతిష్యులకు అనుకూలంగా వస్తే తాము చెప్పిందే జరిగిందంటూ నాలుగు రూపాయలను వెనకేసుకుంటారు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే గ్రహాల ప్రభావమని, ఖగోళంలో వాటి కదలికల్లో అప్పటికీ ఇప్పటికీ మార్పు జరిగిందని, దీనివల్లే గెలవలేదని చెబుతారు. ఎందుకంటే ఖగోళ శాస్త్రం అందరికీ తెలియదు కాబట్టి వారికి తెలియకపోయినా తెలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సమాజంలో ఈ తరహా జ్యోతిష్యులే ఎక్కువ. ఏదేమైనా కానీ జూన్ నాలుగోతేదీ ఉదయం 8.45 గంటలకల్లా ఫలితాల సరళి తేలిపోతుంది. అప్పుడు ఈ జ్యోతిష్యులు చెప్పింది ఎంతవరకు సరైంది అనేది తేలుతుంది.