Wednesday, October 2, 2024
HomeUncategorizedచేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్ నాలుకకు చేసారు

చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్ నాలుకకు చేసారు

Date:

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్ల ఓ బాలికకు లేనిపోని అనారోగ్యం తెచ్చింది. చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్‌ను పొరపాటున నాలుకకు చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. కేరళ కోజికోడ్‌లోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అందరి చేతులకు వేళ్లు 5 ఉంటాయి. కానీ నాలుగేళ్ల చిన్నారి చేతికి మాత్రం 6 వేళ్లు ఉన్నాయి. అయితే అదనంగా వచ్చిన ఆ వేలును సర్జరీ చేసి తొలగించాలని ఆమె కుటుంబ సభ్యులు కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు వచ్చారు. అయితే ఆ చిన్నారిని ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది కొంత సేపటి తర్వాత బయటికి తీసుకువచ్చారు. అయితే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఆ చిన్నారి నోటి చుట్టూ ప్లాస్టర్ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు.

అయితే ఆ బాలిక నోటికి ప్లాస్టర్ ఎందుకు వేశారో ఆమె కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఆ చిన్నారి చేతిని చూడగా.. ఆమెకు ఉన్న ఆరో వేలు అలాగే ఉంది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. నర్సుకు విషయం చెప్పి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ నర్సు నవ్వుతూ ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా ఆ చిన్నారి నాలుకకు కూడా సమస్య ఉందని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. ఈ ఘటన గురించి సదరు డాక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన వచ్చి జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పి.. ఆ చిన్నారి ఆరో వేలు తొలగించేందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ సంఘటన గురించి చిన్నారి తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. సీరియస్‌గా తీసుకుని దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.