Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంకేవలం 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!

కేవలం 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!

Date:

అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్‌ మోసానికి పాల్పడ్డారు. కేవలం 12 సెకన్లలో 25 మిలియన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీలను దొంగిలించారు. ఎట్టకేలకు వారి మోసం బయటపడి ఏడాది తర్వాత పోలీసులకు చిక్కారు. అమెరికాకు చెందిన ఆంటోన్‌ బ్యూనో, జేమ్స్‌ బ్యూనో మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు. అధునాతన సాంకేతికతలో నైపుణ్యం ఉన్న వీరు ఈజీ మనీ కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో క్రిప్టో టెక్నాలజీలో పెండింగ్‌ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్‌ చేసి వాటిని మార్చారు. కేవలం 12 సెకన్లలోనే 25 మిలియన్‌ డాలర్ల విలువైన ఇథేరియం క్రిప్టోలను వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

ట్రేడర్లు తమ ఖాతాల్లోకి క్రిప్టో లావాదేవీలు జమచేస్తున్నా కాకపోవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘరానా మోసం బయటపడింది. దర్యాప్తు చేపట్టిన ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు నిందితులను గుర్తించి తాజాగా పట్టుకున్నారు. బోస్టన్‌లో ఆంటోన్‌ను, న్యూయార్క్‌లో జేమ్స్‌ను అరెస్టు చేశారు. నిందితులు ఐదు నెలల పాటు ఇందుకు ప్లాన్‌ చేసి సెకన్లలో అమలుచేశారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన ఈ అన్నదమ్ములు.. ఆ క్రిప్టోలను తిరిగిచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని కూడా వెల్లడించట్లేదట. ఈ కేసులో నేరం రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.