Tuesday, October 1, 2024
HomeUncategorizedనాన్‌ వెజ్‌ ధర తగ్గింది.. వెజ్‌ థాలీ ధర పెరిగింది..

నాన్‌ వెజ్‌ ధర తగ్గింది.. వెజ్‌ థాలీ ధర పెరిగింది..

Date:

ప్రస్తుత రోజుల్లో మాంసాహారం కంటే శాకాహారం ధర రోజురోజుకూ ప్రియమవుతోంది. అదే సమయంలో నాన్‌ వెజ్‌ ధర తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరగ్గా.. మాంసాహార థాలీ ధర తగ్గింది. క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనాలసిస్‌ తాజాగా వెలువరించిన ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

రోటీ, కూరగాయలు (టమటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌తో కూడిన వెజ్‌ థాలీ సగటు ధర గతేడాది(2023) ఏప్రిల్‌లో రూ.25.4 ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.27.4కు చేరింది. ఈ ఏడాది మార్చి నాటి రూ.27.3తో పోల్చినా స్వల్పంగా పెరిగింది. అదే నాన్‌-వెజ్‌ థాలీలో పప్పు స్థానంలో చికెన్‌ ఉంటుంది. 2023 ఏప్రిల్‌లో సగటు ధర రూ.58.9 ఉండగా, గత నెలలో రూ.56.3 ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ధర రూ.54.9తో పోలిస్తే మాత్రం ఏప్రిల్‌లో ధర పెరిగింది.

సాధారణంగా థాలీని తయారుచేయడానికి వినియోగించే సరకుల ధరల సగటు ఆధారంగా దానికయ్యే ఖర్చును నిర్ణయిస్తారు. దాని ఆధారంగా సామాన్యుడిపై ఎంత భారం పడుతోందన్నది అంచనా వేస్తారు. అయితే, వెజ్‌ థాలీలో వినియోగించే ఉల్లిపాయల ధర 41%, టమాటాలు 40%, బంగాళాదుంపలు 38%, బియ్యం 14%, పప్పులు 20% గతంతో పోలిస్తే ప్రియమయ్యాయి. జీలకర్ర, మిరప, వంటనూనెల ధర వరుసగా 40%, 31%, 10% తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల వెజ్‌ థాలీ ధర మరీ ఎక్కువగా పెరగలేదు.

నాన్‌ వెజ్‌ థాలీ విషయానికొస్తే.. దీని ధరలో 50 శాతం వెయిటేజీ బ్రాయిలర్‌దే. వార్షిక ప్రాతిపదికన బ్రాయిలర్‌ ధర 12% తగ్గడంతో నాన్‌-వెజ్‌ థాలీ ధర తగ్గింది. ఈ మధ్య కాలంలో బ్రాయిలర్‌ ధర 4% పెరగడంతో ఈ ఏడాది మార్చి కంటే ఏప్రిల్‌లో నాన్‌వెజ్‌ థాలీ ధర 3% పెరిగిందని నివేదిక తెలిపింది. ”గతేడాదితో పోలిస్తే వెజ్‌- థాలీ ధర పెరగ్గా.. నాన్‌ వెజ్‌- థాలీ తగ్గింది. బ్రాయిలర్‌ ధర తగ్గడం మూలంగా నాన్‌ వెజ్‌ తగ్గగా.. ఉల్లిపాయలు, దుంపలు, టమాటా ధరలు పెరిగాయి. భవిష్యత్‌లో కూరగాయల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం” అని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ పుషన్‌ శర్మ తెలిపారు.