ముంబయి మ్యాటర్స్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్ (ట్విటర్)’ యూజర్ రైల్వే ట్రాక్ మధ్యలో కొందరు వంట వండుతున్న వీడియో సోషల్మీడియాలో ఇటీవల పోస్ట్ చేశారు. ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై కూర్చొని కొందరు వంట చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. కొంతమంది మహిళలు ట్రాక్ల మధ్యలో స్టవ్ పెట్టి భోజనం తయారుచేస్తుండగా.. పక్కనే బాలికలు చదువుకుంటూ కన్పించారు. పట్టాల పైనే పిల్లలు ఆడుకుంటుండగా.. మరికొందరు నిద్రపోవడం ఆ వీడియోలో ఉంది. జనవరి 24న పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని దీనిపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు.
ఇది కాస్తా తీవ్ర దుమారం రేపడంతో రైల్వే శాఖ స్పందించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్నామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. వారంతా యాచకులని, అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.