Tuesday, October 1, 2024
HomeUncategorizedభారత్‌ సరిహద్దుల్లో 'పాక్‌' డ్రోన్ల కలకలం!

భారత్‌ సరిహద్దుల్లో ‘పాక్‌’ డ్రోన్ల కలకలం!

Date:

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతాదళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. 2022 జనవరి- మే మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో దాదాపు 13 రెట్లు ఎక్కువ డ్రోన్లు పొరుగు దేశం నుంచి భారత భూభాగాల్లోకి చొరబడుతూ పట్టుబడ్డాయి. వాటిలో చాలావరకు చైనాలో తయారైనవే కావడం గమనార్హం. లోక్‌సభ పోలింగ్‌ తేదీల ప్రకటనతో దేశంలో మార్చి 16న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన డ్రోన్లు కూలిన ఘటనల్లో అత్యధికంగా 47 పంజాబ్‌లోనే నమోదయ్యాయి. 13 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో చివరివిడతలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మరో రెండు డ్రోన్లు.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, బికనీర్‌ సెక్టార్లలో పట్టుబడ్డాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2022లో జనవరి- మే 14 మధ్యకాలంలో ఆరు డ్రోన్లు పట్టుబడగా.. 2023లో అదే వ్యవధిలో ఈ సంఖ్య 14కు చేరుకుంది. 2024లో 75కి పెరిగింది. 2022లో 22, 2023లో 119 డ్రోన్లను కూల్చివేశారు. పాకిస్థాన్‌ వెంబడి అంతర్జాతీయ సరిహద్దు నుంచి డ్రోన్ల అక్రమ చొరబాట్లు పెరగడం కలవరం రేపుతోంది.

మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు వినియోగించే డ్రోన్ల కదలికలతో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా నివారించేందుకు అదనపు నిఘా చేపట్టాలని ‘ఈసీ’ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు బీఎస్ఎఫ్‌తోపాటు పంజాబ్, రాజస్థాన్ పోలీసులు, వివిధ విభాగాలు డ్రోన్ల కట్టడిపై దృష్టి సారించాయి” అని ఓ సీనియర్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. నిఘా సమాచారం, సాంకేతిక పరికరాల సాయంతో వాటికి అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. సరిహద్దులో భద్రత ముప్పును కలిగించే ఈ అక్రమ డ్రోన్ల చొరబాట్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. భద్రతా సిబ్బందికి వాటిని కట్టడి చేసే సామర్థ్యం మెరుగైందన్నారు.