Tuesday, October 1, 2024
HomeUncategorizedతెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Date:

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈవో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తున్నట్లు చెప్పారు. అలాగే మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వికాస్ రాజ్ హెచ్చరించారు.

పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత ఎవరు కూడా ప్రచారం చేయకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా మరింత పెంచినట్లు తెలిపారు. మే11న సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండొద్దని చెప్పారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించుకోవచ్చన్నారు.

ఏపీలో కూడా ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించారు. జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం కొనసాగనుంది. లోక్ సభ ఎన్నికలు 6 దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో 102 సీట్లకు పోలింగ్ జరిగింది. రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మూడో దశలో భాగంగా మే 7న 12 రాష్ట్రాల్లో 94 సీట్లలో పోలింగ్ జరిగింది. నాలుగో దశ మే 13న 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలోనే తెలంగాణ, ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఐదో దశలో మే 20న 8 రాష్ట్రాల్లో 49 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో మే 25న 7 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో దశలో జూన్ 1న 8 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి.