ఓ మహిళ పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్.. ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సాధారణ పౌరులకు చూపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ వీడియోలు ఎడిటెడ్ అని ఆరోపించారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
”ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ విడుదల చేశారు. నేను మొత్తం ఫుటేజీ చూశాను. అందులో దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలున్నాయి. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది. ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది” అని దీదీ దుయ్యబట్టారు. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారు. కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదు. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవి నుంచి దిగిపోవాలి. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలి. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లను” అని మమత అన్నారు.