Tuesday, October 1, 2024
HomeUncategorizedఇద్దరు భార్యలు ఉంటే ఈ పథకం కింద రూ.2లక్షలు 

ఇద్దరు భార్యలు ఉంటే ఈ పథకం కింద రూ.2లక్షలు 

Date:

దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం శాయశక్తులా కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో విచ్చలవిడి హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ రత్లాం లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్‌ భురియా ఇచ్చిన ఎన్నికల హామీ ఇప్పుడు విస్తుగొలిపేలా ఉంది. గురువారం సైలనాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంతిలాల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తుందని తెలిపారు. ఆ సొమ్ము నేరుగా మహిళ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు.

ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి ఈ పథకం కింద రూ.2లక్షలు పొందుతారని పేర్కొంటూ వివాదాస్పదమయ్యారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ఏటా ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చాం. ఇద్దరు భార్యలు ఉంటే ఇరువురికీ చెరో లక్ష చొప్పున రూ.2 లక్షలు వేస్తాం’ అని కాంతిలాల్ అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఇలాంటి హామీలు ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.