గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అల్లాడుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. దీంతో అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వర్షాలకు రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 78 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వరదలకు 155 మందికిపైగా గాయపడినట్లు పేర్కొంది. సుమారుగా లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది. ఉరుగ్వే, అర్జెంటీనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రంలోని దాదాపు 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని వరదలు ప్రభావితం చేసినట్లు వెల్లడించింది.
పెద్ద ఎత్తున్న వచ్చిన వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రధాన నగరాలను కలిపే వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో సహాయం చేసేందుకు రెండ్రోజుల కిందటే 626 దళాలలతోపాటు, 12 విమానాలు, 12 బోట్లను మోహరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు.