ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆ ఉద్యోగాలెక్కడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? అని నిలదీశారు.
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ”పూర్తి మద్యపాన నిషేధమన్నారు.. ఏమైంది? జగన్ సర్కారే మద్యం అమ్ముతోంది. వాళ్లు ఏ బ్రాండ్ పెడితే అవే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో పెట్టారు. ప్రజలు నాసిరకం లిక్కర్ తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోతున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా మాఫియాలే. వేల కేజీల్లో డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి” అని షర్మిల ఆరోపించారు.