ఈ దేశ ఆడబిడ్డలు ఓడిపోయారు. బ్రిజ్ భూషణ్ గెలిచాడు. ఆయనకు వ్యతిరేకంగా మేమంతా మా కెరీర్‌లను పణంగా పెట్టి పోరాడాం. ఎండనకా.. వాననకా.. ఎన్నో రోజులు రోడ్లపై నిద్రించాం. అయినా ఆయనను ఇంతవరకు అరెస్టు చేయలేదు. మేం న్యాయం తప్ప ఇంకేం డిమాండ్ చేయట్లేదు. అరెస్టు విషయం పక్కనబెట్టండి. ఈ రోజు ఆయన కుమారుడికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో మీరు (భాజపాను ఉద్దేశిస్తూ) కోట్లాది మంది అమ్మాయిల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. కేవలం ఒకే ఒక్క కుటుంబానికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే.. ఒక వ్యక్తి ముందు ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనపడిందా? శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన బాటలో నడవరా?” అని సాక్షి ప్రశ్నించారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు ఈ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్ స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఈ ప్రకటనపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఒక్క వ్యక్తి ముందు లొంగిపోయిందా?అని నిలదీశారు.