Monday, December 23, 2024
HomeUncategorizedఅహంకారం, నియంతృత్వం చెల్లదని తేల్చారు

అహంకారం, నియంతృత్వం చెల్లదని తేల్చారు

Date:

తెలంగాణ ప్రజలు ఓటుతో సరైన తీర్పునిచ్చారని, ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని, అహంకారం, నియంతృత్వం చెల్లదని తేల్చి చెప్పారన్నారని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రాజ్యంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లపాటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ధ్వంసమైన వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్ తమిళిసై అన్నారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. దీనిపై ఎలాంటి అపోహలకూ యువతకు లోనుకావొద్దు. దావోస్‌ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాని గవర్నర్ చెప్పారు. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నామని తమిళిసై తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.