అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌత్ కరోలినాలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్.
”వారు ప్రయాణిస్తున్న వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఇంత వేగంతో ప్రయాణించడం చాలా అరుదుగా చూస్తాం” అని అధికారులు తెలిపారు. దాని వల్ల అదుపుతప్పిన ఎస్‌యూవీ.. రహదారిపై 4-6 వరుసలు పల్టీ కొడుతూ చెట్లపైకి ఎగిరిపడి, ఇరుక్కుపోయింది. ఆ సమయంలో గాల్లోకి 20 అడుగుల ఎత్తుకు లేచినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.