Monday, September 30, 2024
HomeUncategorizedఓటు వేసిన వారికి బటర్‌ దోశ, లడ్డూ, జ్యూస్‌

ఓటు వేసిన వారికి బటర్‌ దోశ, లడ్డూ, జ్యూస్‌

Date:

బెంగళూరు నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచే ఉద్దేశంతో బృహత్‌ బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ (బీబీహెచ్‌ఏ)కు అనుబంధంగా ఉన్న పలు రెస్టారంట్లు తమవంతు ప్రయత్నం చేయాలని భావించాయి. ఇందులోభాగంగా ఓటు వేసి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందించగా.. మరికొన్ని మాత్రం బిల్లులో డిస్కౌంట్‌ ఇచ్చాయి. నృపతుంగా రోడ్డులో ఉన్న నిసర్గ గ్రాండ్‌ హోటల్‌.. ఓటు వేసి వచ్చినవారికి బటర్‌ దోశ, లడ్డూ, జ్యూస్‌ వంటివి ఉచితంగా అందించింది. ‘ఓటు వేయండి-ఫుడ్‌ తినండి’ అనే నినాదంతో వీటిని అందించింది. దీంతో ఉదయం నుంచే అనేకమంది ఓటర్లు హోటల్‌ ముందు బారులు తీరారు. దాదాపు 2వేల మందికి వీటిని ఫ్రీగా అందించారట.

నగరంలోని అనేక రెస్టారంట్లు, బేకరీలు.. వినోద కేంద్రాలు, పార్కులు, ర్యాపిడో వంటి టాక్సీ సర్వీసులు కూడా 20 నుంచి 30శాతం డిస్కౌంట్‌ ప్రకటించాయి. అంతేకాదు అనేక బార్లు కూడా ఇటువంటి ఆఫర్‌తో ముందుకొచ్చాయి. కొన్ని బార్లు (పరిమిత సంఖ్యలో కస్టమర్లకు) బీర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించగా, మరికొన్ని డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపాయి. అయితే, పోలింగ్‌ రోజు వైన్స్‌, బార్‌లు మూసివేసి ఉన్నందున, మరుసటి రోజు (శనివారం) ఈ ఆఫర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో పోలింగ్‌ 54శాతంగా నమోదైంది. ఈవిషయాన్ని ప్రస్తావించిన బీబీహెచ్‌ఏ అధ్యక్షుడు పీసీ రావు.. ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్న ఈ నగరంలో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటం నిరాశ కలిగించే అంశమన్నారు. అందుకే పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు తమవంతు ప్రయత్నంగా ఈ ఐడియాతో ముందుకు వచ్చామన్నారు.