Monday, September 30, 2024
Homeచదువుజేఈఈ ఆల్ ఇండియా టాప‌ర్ నీల‌కృష్ణ గ‌జారే రైతు బిడ్డ

జేఈఈ ఆల్ ఇండియా టాప‌ర్ నీల‌కృష్ణ గ‌జారే రైతు బిడ్డ

Date:

జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా టాప‌ర్ ర్యాంక్ సాధించిన నీల‌కృష్ణ గ‌జారే.. మ‌హారాష్ట్ర‌లోని వాసిమ్ జిల్లాకు చెందిన ఓ రైతు కుమారుడు. స‌డ‌ల‌ని ప‌ట్టుద‌ల, ఆత్మ‌విశ్వాసంతో గ‌త రెండేళ్ల నుంచి అత‌ను ప‌రీక్ష‌లు ప్రిపేర‌య్యాడు. వాసిమ్ జిల్లాలోని బేల్‌ఖేడ్ గ్రామానికి చెందిన అత‌ను చాలా క‌ఠిన‌మైన షెడ్యూల్‌తో ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌తి రోజూ ప‌ది గంట‌ల పాటు చ‌దువుకే అంకిత‌మ‌య్యేవాడు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను గురువారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌న కుమారుడు సాధించిన విజయం ప‌ట్ల మాట‌లు రావ‌డం లేద‌ని నీల‌కృష్ణ తండ్రి నిర్మ‌ల్ గ‌జారే తెలిపారు.

అకోలాలోని రాజేశ్వ‌ర్ కాన్వెంట్‌లో నీల‌కృష్ణ ప్రైమ‌రీ స్కూలింగ్ చేశాడు. వాసిమ్‌లోని ఖ‌రంజాలోని జేసీ హైస్కూల్‌లోనూ చ‌దివాడు. త‌న కుమారుడు హార్డ్ వ‌ర్క్ చేస్తాడ‌ని, అత‌ను ఆర్చ‌రీలో రాష్ట్ర‌, జాతీయ జ‌ట్టుకు ఎంపికైన‌ట్లు తండ్రి చెప్పాడు. ప్ర‌స్తుతం అత‌ను శ్రీ ధ్యానేశ్వ‌ర్ మాసుక్‌జీ బురుంగ‌లే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చ‌దువుతున్నాడు. నీల‌కృష్ణ తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కే నిద్ర‌లేస్తాడు. రెండు గంట‌ల పాటు చ‌దువుకుంటాడు. ఆ త‌ర్వాత ప్రాణాయామం చేస్తాడు. మ‌ళ్లీ 8.30 నిమిషాల‌కు చ‌దువు ప్రారంభిస్తాడు. రాత్రి 10 గంట‌ల‌కు నిద్ర‌పోతాడు. ఐఐటీ బాంబేలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌ని నీల‌కృష్ణ ఆశిస్తున్న‌ట్లు తండ్రి తెలిపారు. షీగావ్‌లో ఉన్న నీల‌కృష్ణ ప్ర‌స్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం ప్రిపేర‌వుతున్నాడు.