Monday, September 30, 2024
HomeUncategorizedరాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చాను

రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చాను

Date:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్‌ వద్దకు ముఖ్యమంత్రి రావాలని ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో ఆయన హరీశ్‌ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు వచ్చారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు.

ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్నారు. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకుగాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని హరీశ్‌ రావు అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్‌ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్‌ అని విమర్శించారు.