Monday, September 30, 2024
HomeUncategorizedగంపనిండా 25వేల చిల్లర నాణాలతో నామినేషన్

గంపనిండా 25వేల చిల్లర నాణాలతో నామినేషన్

Date:

కరీంనగర్ లోకసభ స్థానానికి సైదాపూర్ మండలం బొమ్మకల్‎కు చెందిన మానస రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు మంగళవారం నామినేషన్ పత్రాలు అందించేందుకు ఆమెతో పాటు ప్రతిపాదకులు కూడా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. మానసరెడ్డి ఓ గంపను కూడా పట్టుకుని రావడంతో నామినేషన్ సెంటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులు అడ్డుకున్నారు. దీంతో గంపను తలమీద నుండి దించి చూపించడంతో బందోబస్తు నిర్వహిస్తున్న జవాన్లు, అధికారులు అవాక్కయ్యారు. ఆ గంపలో చిల్లర కాయిన్లను తీసుకుని నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆమెను అధికారులు లోపలకు అనుమతించారు.

ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలంటే రూ. 25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మానస రెడ్డి సామాన్యుల గొంతుకగా బరిలో నిలుస్తానని ప్రకటించండంతో పాటు వారి సహకారాన్ని కూడా అభ్యర్థించారు. మానసరెడ్డికి అండగా నిలిచిన వారు ఇచ్చిన కాయిన్లన్ని లెక్కిస్తే రూ. 30 వేలు కాగా అందులో రూ. 25 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు నామినేషన్ సెంటర్‎కు తీసుకొచ్చారు. ఎన్నికల్లో నిలబడాలని ప్రోత్సహించిన వారు ఇచ్చిన కాయిన్స్‎నే నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం వినియోగించాలని భావించి వాటినే తీసుకొచ్చి ఎన్నికల అధికారులకు అప్పగించారు. చూసే వారికి వెరైటీగా అనిపించినప్పటికీ మానస రెడ్డి మాత్రం తనను అక్కున చేర్చుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తానంటూ నామినేషన్ ప్రక్రియ నుండే పనితనాన్ని చేతల్లో చూపిస్తున్నానని అంటున్నారు. వారిచ్చిన నగదునే డిపాజిట్ రూపంలో చెల్లించి వారి ఆశయాల మేరకే నడుచుకునే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఏది ఏమైనా మానస రెడ్డి నామినేషన్ కేంద్రానికి గంపతో కాయిన్స్ తీసుకుని రావడం మాత్రం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.