Monday, September 30, 2024
HomeUncategorizedఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై వేటు

ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై వేటు

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించింది.

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల వ్యవహారశైలిపై ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మరి కొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.” ప్రధాని మోడీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫ్యల్యాలతో పాటు, ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ప్రయత్నించారు. ఎన్నికలను మేనేజ్‌ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు భారీగా నగదు తీసుకున్నారు. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా సీతారామాంజనేయులు బాధ్యులుగా ఉన్నారు. మూడేళ్లుగా ఇంటెలిజెన్స్‌ డీజీగా కొనసాగుతున్న ఆయన అపరిమిత అధికారాలు ఉపయోగించుకుని విపక్ష నేతలను వేధిస్తున్నారు. ఇటీవల సీఎంపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతిరాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.