మలేషియాలో నౌకాదళ వార్షిక పరేడ్ విషాదాంతంగా ముగిసింది. నౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్లు ఒకేసారి గాల్లో ఎగురుతున్నాయి. అందులో రెండు హెలికాఫ్టర్లు దిశ మార్చుకుని పక్క పక్కనే వచ్చి ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో ఒకదాని రెక్కలు మరో దానికి తగిలి రెండూ వెంటనే కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 10 మందికి పైగా నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
మలేషియాలోని లుముట్ నగరంలో రాయల్ నేవీ వార్షిక పరేడ్ జరుగుతోంది. ఇందులో భాగంగా హెలికాప్టర్లు కూడా విన్యాసాలు చేస్తున్నాయి. వీటిని అక్కడే ఉన్న అధికారులు, సిబ్బంది ఉత్కంఠగా తిలకిస్తున్నారు. అంతలో అందరూ చూస్తుండగానే రెండు హెలికాఫ్టర్లు పరస్పరం గుద్దుకున్నాయి. వెంటనే అదుపు తప్పి కిందకు కూలిపోయాయి. దీంతో వీటిలో ప్రయాణిస్తున్న 10 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి చావుతో పోరాడుతున్నారు.
హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనా స్ధలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. హెలికాఫ్టర్లు ముక్కలు ముక్కలై కాలిపోయాయి. మలేషియా అధికారులు ఈ ఘటనపై అత్యున్నత స్ధాయి విచారణ చేపట్టారు.