Monday, September 30, 2024
HomeUncategorizedబాంచన్.. కాళ్లు మొక్కుతా వడ్లు కొనండి సారూ..

బాంచన్.. కాళ్లు మొక్కుతా వడ్లు కొనండి సారూ..

Date:

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కోతలు అయిపోయి.. రైతులు ధాన్యాన్ని కల్లాల్లోకి తరలించారు. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో పంటలు కోతలకు రాగా.. చాలా వరకు ధాన్యం కల్లాల్లో ఉంది. సుమారు 15 రోజులుగా ఎప్పుడెప్పుడూ అధికారులు వడ్లు కొంటారా అని కళ్లల్లో వత్తులేసుకుని మరీ రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. పంటకు కావాల్సినప్పుడు ముఖం చాటేసిన వరుణుడు.. పంట కోతకు వచ్చే సమయంలోనో, ధాన్యం కల్లాల్లోకి వచ్చిన తర్వాతో పనిగట్టుకుని మరీ విరుచుకుపడుతూ.. ఆరుగాలం పడి కష్టాన్ని నేలపాలు చేస్తూ.. అన్నదాతల గుండెలను చెరువులు చేస్తుండటం బాధాకరం.

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి జోరుగా నడుస్తుండటంతో.. రైతులను పట్టించుకునే నాథుడు కరువవటంతో.. పూర్తిగా ఎండిపోయిన ధాన్యం కాస్తా.. అకాల వర్షాల ధాటికి తడిపోయి.. వరదల్లో కొట్టుకుపోతుంది. దీంతో.. కన్నెర్ర చేసిన రైతులు రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. జనగాం మార్కెట్లో వడ్లు కొనాలి అంటూ రైతులు, కమ్యూనిస్టు నేతలు ఆందోళన చేశారు. ఆ సమయంలో వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు రాగా.. అక్కడే ఉన్న ఓ మహిళా రైతు.. “మీ బాంచన్ వడ్లు కొనండి సారూ..” అంటూ పోలీసుల కాళ్లు మొక్కుతుండటం అందరి గుండెలను మెలిపెట్టేసింది.

ఈ దృశ్యం చూసైనా.. అధికారులు, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను వర్షాలపాలు కాకుండా.. ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే సరైన నీరు అందక.. అంతంత మాత్రమే పంట పండిందని.. వచ్చిన దిగుబడి కూడా ఇలా అకాల వర్షాల పాలైతే.. రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.