Sunday, December 22, 2024
HomeUncategorizedభారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన మయిజ్జు

భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన మయిజ్జు

Date:

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. ”భారత రాష్ట్రపతి, ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలకు వేర్వేరుగా సందేశాలు పంపారు. రానున్నకాలంలో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని వందల ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, బంధాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు” అని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు ఇబ్రహీం సోలీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. భవిష్యత్తులో ఇది మరింత బలపడాలని ఆయన ఎక్స్‌లో పోస్టు చేసిన సందేశంలో ఆకాంక్షించారు. గతేడాది మాల్దీవుల్లో ఎన్నికల అనంతరం ముయిజ్జు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకొన్నాయి. ఇటీవల ఆ దేశానికి చెందిన ముగ్గురు మంత్రులు మన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వారిని పదవి నుంచి తప్పించి మాలె నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు ఆ దేశంలో ఉన్న భారత సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని నూతన ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకొంటోంది.