Sunday, September 29, 2024
HomeUncategorizedమూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ దేశాల్లో సురక్షితం

మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ దేశాల్లో సురక్షితం

Date:

ప్రపంచంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానం కలుగుతోంది. హమాస్, ఇజ్రాయెల్ ఘర్షణలు మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే వాతావరణం కల్పించాయి. ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్‌పై వైమానిక దాడి ప్రారంభించింది. భారీ సంఖ్యలో తమ భూభాగంపైకి దూసుకొచ్చిన క్షిపణులను ఇజ్రాయెల్, అమెరికా, ఇతర దేశాల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. అయితే సిరియాలో తమ సైనిక సిబ్బందిని హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆపరేషన్ ముగిసిందని, మళ్లీ దాడి చేసే ఉద్దేశం లేదని పేర్కొంది. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రతిదాడికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై టెల్ అవీవ్‌ను అమెరికా హెచ్చరించింది. ప్రతి దాడి చేస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని, తాము దీనికి మద్దతివ్వబోమని తేల్చి చెప్పింది.

ఈ పరిణామాలు వరల్డ్ వార్-3కి దారితీస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఇప్పటికే మధ్యప్రాచ్యం ఉడికిపోతోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడి ఘర్షణలను మరింత పెంచే అవకాశం ఉంది. తాజా ఆపరేషన్‌లో ఇరాన్.. ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ వంటి పొరుగు దేశాల నుండి క్షిపణులను ప్రయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడానికి యునైటెడ్ స్టేట్స్, యూకే ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలిచాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలూ సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఘర్షణలు మరింత పెరిగి ప్రపంచ యుద్ధంగా మారితే, ఆ ప్రభావం చాలా దేశాలపై పడుతుంది. అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కొన్ని దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి యుద్ధంలో తలదూర్చే అవకాశం లేదు. వరల్డ్ వార్ 3 వచ్చినా ప్రభావితం కాని 10 దేశాలు, ప్రస్తుతం సేఫ్ కంట్రీస్‌గా గుర్తింపు పొందాయి.

*ఇండోనేషియా

ఇండోనేషియా యుద్ధ క్షేత్రాలకు దగ్గరగా లేదు. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశం ‘ఫ్రీ అండ్ యాక్టివ్’ ఫారెన్ పాలసీ ఫాలో అవుతుంది, ఇతర దేశాల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చదు.

*న్యూజిలాండ్

యుద్ధ వివాదాల చరిత్ర లేని ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రపంచ దేశాల వివాదాల్లో న్యూజిలాండ్ జోక్యం చేసుకోదు. యుద్ధాల ప్రభావం ఈ దేశంపై ఉండే అవకాశమే లేదు.

*గ్రీన్‌ల్యాండ్

ఇది డెన్మార్క్ స్వయంప్రతిపత్తి కలిగిన దేశం. వ్యూహాత్మకంగా చూస్తే యుద్ధ క్షేత్రాలకు సుదూరంగా ఉండే, రాజకీయ ప్రమేయాలు పెద్దగా లేని ప్రాంతం. అందుకే యుద్ధం వచ్చినా, ఇక్కడ ఘర్షణలు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ.

*ఐస్‌ల్యాండ్

మంచినీటి నిల్వలు, సముద్ర వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం, ఎలాంటి పెద్ద యుద్దాలకైనా ప్రభావితం కాదు.

*దక్షిణాఫ్రికా

ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న, స్టెబుల్ ఫారెన్ పాలసీ ఉన్న దేశం ఇది. నిబద్ధత గల దక్షిణాఫ్రికాకు, యుద్ధం కారణంగా ఏర్పడే ప్రమాదాల నుండి తప్పించుకునే సామర్థ్యం ఉంది. వరల్డ్ వార్ 3 వచ్చినా, ఇక్కడి మనుగడపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు.

*అంటార్కిటికా

అంటార్కిటికా లొకేషన్, దాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుంది. ఇది యుద్ధభూమిగా మారే అవకాశం లేదు.

*భూటాన్

హిమాలయాల మధ్య ఉండే అందమైన దేశం ఇది. భారత్‌కు దగ్గర్లో ఉండే భూటాన్, లొకేషన్, రాజకీయాల పరంగా యుద్ధాలకు ప్రభావితం కాదు. ఎవరికైనా మంచి షెల్టర్ ఇస్తుంది.

*తువాలు

ఇది ఒక తటస్థ దేశం. రాజకీయ పరంగా పెద్దగా ప్రభావం చూసే శక్తులు లేవు. యుద్ధాలకు ప్రభావితమయ్యే వాతావరణం ఇక్కడ ఉండదు.

*ఐర్లాండ్

శాంతియుత వైఖరిని ప్రతిబింబించే విదేశాంగ విధానం ఈ దేశం సొంతం. ఇతర దేశాల ఘర్షణల్లో న్యూట్రల్‌గా ఉంటుంది.

*స్విట్జర్లాండ్

మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో తటస్థంగా ఉన్న ఈ దేశం, మళ్లీ ఎన్ని యుద్ధాలు వచ్చినా న్యూట్రల్‌గానే ఉండనుంది.