Saturday, September 28, 2024
Homeక్రైంతండ్రి సైనికుడిగా పనిచేసాడు.. కొడుకు ఉగ్రవాది

తండ్రి సైనికుడిగా పనిచేసాడు.. కొడుకు ఉగ్రవాది

Date:

కర్ణాటక బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసిన అనుమానిత తీవ్రవాదులు ముసావిర్‌ హుసేన్‌ శాజిబ్‌, అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహాలను జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచింది. పది రోజులు వారిని విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు ప్రణాళికను రూపొందించుకున్నారు. బాంబుల తయారీ, పేలుడు అనంతరం తప్పించుకోవడం, ప్రమాణించే మార్గాల పటాల రూపకల్పన తదితరాల్లో వీరిద్దరూ సిద్ధహస్తులని గుర్తించారు. నిందితులను విచారించేందుకు మడివాళలోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో ప్రత్యేక సెల్‌ను సిద్ధం చేశారు.

ట్రాన్సిట్ వారెంట్పై వారిని తీసుకు వచ్చారు. భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. చెన్నైలో విఘ్నేశ్‌, మహ్మద్‌ జునైద్‌ సయ్యద్‌, సంజయ్‌ అగర్వాల్‌, ఉదయ్‌ దాస్‌, కోల్‌కతాలో అన్మోల్‌ కులకర్ణి, యశు శహనవాజ్‌ పాటిల్‌ తదితర పేర్లు పెట్టుకుని ముసావిర్‌ తిరిగాడు. నకిలీ ఆధార్‌ కార్డును చేయించుకున్నాడు. నిందితులు కోల్‌కతాలో 12 రోజుల పాటు రోజుకో ప్రదేశంలో తలదాచుకుంటూ వచ్చారు. అబ్దుల్‌ మతీన్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. తండ్రి దేశం కోసం సైనికుడిగా సేవలందించారు. అనారోగ్యంతో గత ఏడాది ఆయన మరణించారు. మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్‌ మైండ్‌ ఇతడేనని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.