Saturday, September 28, 2024
HomeUncategorizedగ్యారెంటీలు మోడీ తప్పుడు హామీలకు వారెంటీలు

గ్యారెంటీలు మోడీ తప్పుడు హామీలకు వారెంటీలు

Date:

గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, ఇప్పుడు బిజెపి లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీల పత్రంగా కొట్టిపారేసింది. తాజాగా ‘సంకల్ప పత్ర’లో పేర్కొన్న గ్యారెంటీలన్నీ మోడీ తప్పుడు హామీలకు వారెంటీలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయ రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి హామీలను మోడీ నెరవేర్చలేదని ఖర్గే తెలిపారు. పైగా వీటన్నింటినీ 2047కు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో యువత, రైతులు సహా దేశ ప్రజల ప్రయోజనాల కోసం మోడీ ఏమీ చేయలేదని విమర్శించారు. యువత ఉపాధి అవకాశాల కోసం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వీటి పరిష్కారంపై బిజెపి మేనిఫెస్టోలో ఒక్క హామీ లేదని ఆరోపించారు.

2014 మేనిఫెస్టోలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని మోడీ హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా అన్నారు. కానీ, చివరకు ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈశాన్య భారత్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని భాజపా హామీ ఇచ్చిందని.. కానీ, అక్కడ ప్రస్తుతం హింస చెలరేగుతోందన్నారు. 100 జిల్లాల్లో పేదరికాన్ని పూర్తిగా తొలగిస్తామన్న గత హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ‘ప్రపంచ ఆకలి సూచీ’లో భారత్‌ స్థానమే అందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తప్పుడు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా కేవలం 13 రోజుల్లోనే బిజెపి మేనిఫెస్టోను రూపొందించిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందనే వాదనలో వాస్తవం లేదన్నారు. బిజెపి తప్పుడు హామీలతో ప్రజలు విసిగి పోయారని.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు.