Saturday, September 28, 2024
HomeUncategorizedభారత్‌ మాతాకీ జై నినాదానికి ఖర్గే అనుమతి

భారత్‌ మాతాకీ జై నినాదానికి ఖర్గే అనుమతి

Date:

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై భారతమాతను కీర్తించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అనుమతి కోరడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందించిన బిజెపి తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని కలబురగిలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ సావడి మాట్లాడుతూ.. ”మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. దీనిని ఖర్గే తప్పుగా అర్థం చేసుకోరని ఆశిస్తూ.. నేను ‘బోలో భారత్‌ మాతాకీ జై’ అని నినదిస్తా. పిడికిలి బిగించి మీరంతా నాతో పాటు దీన్ని పునరావృతం చేయాలి” అని ప్రజలను కోరారు.

దీన్ని బిజెపి తీవ్రంగా తప్పుబట్టింది. ”కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. భారతమాత పేరును నినదించాలన్నా, దేశభక్తిని చాటాలన్నా అక్కడ పైనుంచి అనుమతులు కావాలి. ఇది నిజంగా దురదృష్టకరం, ఎంతో ప్రమాదకరం. దేశభక్తిని నిరూపించుకునేందుకు సావడి వ్యర్థ ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితి బీజేపీలో మాత్రం లేదు” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర విమర్శించారు.

పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారి పక్షాన ప్రియాంక్‌ ఖర్గే ఎలా వాదించారో గతంలో చూశామని బిజెపి గుర్తు చేసింది. కాంగ్రెస్‌ అసలు సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న లక్ష్మణ్‌ భారతమాతను కీర్తించేందుకు భయపడ్డారని విమర్శించింది. నిజమైన దేశభక్తుడు ఏ పార్టీలో ఉన్నా ‘భారత మాతా కీ జై’ అని నినదించడానికి అగ్ర నాయకుల అనుమతి అవసరం లేదని పేర్కొంది.