Saturday, September 28, 2024
HomeUncategorizedబోర్న్‌విటా ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించండి

బోర్న్‌విటా ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించండి

Date:

బోర్న్‌విటా సహా ఇతర పానీయాలను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలని ఈ కామర్స్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్‌విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవలే ఎన్‌సీపీసీఆర్‌ నిర్ధారించిన విషయం తెలిసిందే. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం-2005లోని సెక్షన్ 3 కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవలే సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదని నిర్ధారణకు వచ్చినట్లు కేంద్రం ఏప్రిల్‌ 10 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బోర్న్‌విటా సహా కూల్‌డ్రింక్స్‌, బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి వెంటనే తొలగించాలని ఈ కామర్స్‌ సంస్థలను ఆదేశించింది.

బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సదరు యూట్యూబర్‌ విమర్శించాడు. దీనిపై ఎన్‌సీపీసీఆర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీపీసీఆర్‌ విచారణ జరపగా.. బోర్న్‌విటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఈ కామర్స్‌ కంపెనీలు, పోర్టల్స్‌ నుంచి బోర్న్‌విటా సహా అన్ని డ్రింక్స్‌, బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది.