Saturday, September 28, 2024
HomeUncategorizedఅవినీతి అధికారులు, నేరగాళ్లు 97శాతం

అవినీతి అధికారులు, నేరగాళ్లు 97శాతం

Date:

2014లో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. గ్రూప్‌ సి, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడం, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ను తీసుకురావడం దానిలో భాగమేనని గుర్తుచేశారు. ఈ చర్యలతో గత పదేళ్లలో దాదాపు 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారుల పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.22.75లక్షల కోట్లను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లు తెలిపారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు. ”అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. బిజెపిఐ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మా చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3శాతం వాటికే రాజకీయాలతో సంబంధముంది. మిగతా 97శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే” అని మోదీ వెల్లడించారు.

2014 ముందు ఈడీ అటాచ్‌ చేసుకున్న ఆస్తులు విలువ రూ.25వేల కోట్లుగా ఉండగా.. గత పదేళ్లలో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు పెరిగిందని మోదీ వెల్లడించారు. ”పోలింగ్‌ ప్రారంభం కాకముందు నుంచే చాలా మంది ఈవీఎంలపై నిందలు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విపక్షాలకూ తెలుసు. అందుకే చాలా మంది ప్రతిపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు” అని మోదీ విమర్శలు గుప్పించారు.