Saturday, September 28, 2024
HomeUncategorizedరైతులకు నష్టం చేస్తే సహించేది లేదు

రైతులకు నష్టం చేస్తే సహించేది లేదు

Date:

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు రైతులకు నష్టం కలిగిస్తే ఏ ఒక్కరిని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్​లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రిక కథనాలపై ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ స్పందించారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను సీఎం అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా సాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోలు విషయంమై “ట్విట్టర్‌” వేదికగా సీఎం రేవంత్‌ స్పందించారు. తాగు నీరు, ధాన్యం కొనుగోళ్లు, వేసవి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనగోలు కేంద్రాల్లో తాగు నీరు, ఓఆర్​ఎస్‌​ను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తెలిపారు. వర్షాకాలం వచ్చేంత వరకు తాగు నీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ‘మన ఊరు – మన బడి’ పనులు చేపట్టేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని సీఎస్ కలెక్టర్లతో తెలిపారు. నిధులు, అనుమతులు మంజూరైనందున పాఠశాలల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజలకు, సిబ్బందికి దీనిపై అవగాహన పెంచాలని సీఎస్​ సూచించారు.