Wednesday, October 30, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు

కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు

Date:

ఢిల్లీ లిక్కర్ విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని వైభవ్‌ కుమార్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన్ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకంలో అవకతవకలు జరిగాయి. పాలనావ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్‌ లేకుండా, పూర్వాపరాలను సరిచూడకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదు. వైభవ్‌పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవి. వాటిపై విచారణ జరుగుతోంది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే పీఎస్‌గా నియమించారని విజిలెన్స్‌ విభాగం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యం కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 8న వైభవ్‌ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనపై వేటు వేయడం గమనార్హం. ఈ పరిణామాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పార్టీని సమూలంగా నాశనం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని బిజెపిపై విరుచుకుపడింది. ”మొదట తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహా కేజ్రీవాల్‌ సిబ్బంది మొత్తాన్ని తొలగించే పని మొదలుపెట్టారు. ఆప్‌ను నాశనం చేయడమే బిజెపి ఏకైక లక్ష్యమని మరోసారి స్పష్టమైంది అని మండిపడింది.