Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంఆర్మీ స్టైల్ ప్రాక్టీస్‌ చేస్తున్న పాక్ క్రికెటర్లు

ఆర్మీ స్టైల్ ప్రాక్టీస్‌ చేస్తున్న పాక్ క్రికెటర్లు

Date:

పాకిస్థాన్ క్రికెటర్లు ఆర్మీ స్టైల్ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. రాళ్లు మోస్తూ.. గుట్టలు ఎక్కుతూ .. స్నైపర్ షూటింగ్ చేస్తూ.. భుజాలపై ఒకరిని ఎత్తుకొని పరిగెత్తుతూ.. సాధన చేస్తున్నారు. ఇదంతా ఆ దేశ సైనికుల పర్యవేక్షణలో సాగుతోంది. ఈ కొత్తరకం శిక్షణ దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు కొంచెం కన్ఫ్యూజింగ్‌గా స్పందిస్తున్నారు. వారు క్రికెట్‌లో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటున్నారా..? లేక ఏ రహస్య మిషన్ కోసమైనా సిద్ధం అవుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు, ఈ షూటింగ్‌కు సంబంధం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఆ గుట్ట ప్రాంతంలో జారిపడితే గాయాలు కావా..? అని అడుగుతున్నారు.

క్రికెటర్లకు సైన్యంతో శిక్షణ ఇప్పిస్తామని ఇటీవల పీసీబీ ఛైర్మన్‌ మొహసీన్‌ నక్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల పీఎస్ఎల్‌ టోర్నీలో భాగంగా కొన్ని మ్యాచ్‌లను ఆయన వీక్షించగా.. పాక్‌ ఆటగాళ్లు ఒక్క బంతిని కూడా స్టాండ్స్‌లోకి తరలించలేకపోయారు. దాంతో అసహనానికి గురైన ఆయన.. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలో జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపారు.

ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్‌నెస్‌ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్‌ అఫ్రీదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్‌ అజామ్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.