Saturday, September 28, 2024
HomeUncategorizedఇకపై రైల్వేస్టేషన్లలో బియ్యం, పిండి అమ్మకాలు

ఇకపై రైల్వేస్టేషన్లలో బియ్యం, పిండి అమ్మకాలు

Date:

కేంద్ర రైల్వేశాఖ ప్రయాణీకుల కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సాధారణ వినియోగదారులు, ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడానికి, రైల్వే బోర్డు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ సహకారంతో సబర్బన్, నాన్-సబర్బన్ గ్రూప్ వన్ మినహా అన్ని స్టేషన్లలో బియ్యం, పిండి అమ్మకాలను అనుమతించింది.

ముందుగా జార్ఖండ్ బీహార్, బెంగాల్‌లకు ప్రయాణించే వ్యక్తుల కోసం రైల్వే శాఖ ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో, ప్రజలు ఇప్పుడు రైల్వేస్టేషన్ నుంచే రోజూ ఇంటికి కావాల్సిన రేషన్ సామాన్లు కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి బియ్యం, పిండిని అమ్ముతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును 3 నెలలపాటూ అమలుచేస్తారు. ఇది విజయవంతమైతే.. దీర్ఘకాలం కొనసాగిస్తారు.

బియ్యం, పిండిని ఎలా కొనాలి?

ఒక్కో రైల్వేస్టేషన్ దగ్గర ఒక్కో మొబైల్ వ్యాన్ ఉంటుంది. రోజూ సాయంత్రం వేళ 2 గంటలపాటూ ఈ వ్యాన్‌ ద్వారా పిండి, బియ్యం అమ్ముతారు. 2 గంటల తర్వాత మొబైల్ వ్యాన్ స్టేషన్ నుంచి వెళ్లిపోతుంది. ఈ వ్యాన్‌లో అమ్మే పిండి, బియ్యం ధరలు ఒకింత తక్కువగా ఉంటాయి. ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ప్రస్తుతానికి కేజీ బియ్యం ధర రూ.29గా నిర్ణయించారు. అలాగే కేజీ పిండి ధర రూ.27.50గా నిర్ణయించారు. ఏ స్టేషన్లలో అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది డివిజనల్ రైల్వే మేనేజర్‌లతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో.. బియ్యం, మైదా, గోధుమపిండి, పప్పులను స్థిరమైన ధరలతో అమ్ముతోంది. ఇప్పుడు రైల్వేస్టేషన్లలో కూడా అమ్మితే.. ప్రజలు పెద్ద సంఖ్యలో కొనే అవకాశాలు ఉంటాయి.