Saturday, September 28, 2024
HomeUncategorizedప్రజలు ఓట్లేసింది హత్యలు చేయించడానికా?

ప్రజలు ఓట్లేసింది హత్యలు చేయించడానికా?

Date:

వైఎస్ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మేనమామ అంటూనే రవీంద్రనాథ్‌రెడ్డిపై షర్మిల విమర్శలు గుప్పించారు. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ”హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైకాపా టికెట్లు ఇచ్చింది. తెలంగాణ నుంచి వచ్చానని మా మేనమామ అంటున్నారు. అక్కడ కేసీఆర్‌ను ఓడించాం.. మా పని అయిపోయింది. ఏపీలో నా పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయి ఉంటే వేలమందికి ఉద్యోగాలొచ్చేవి. శంకుస్థాపనలే తప్ప ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. జగన్‌ కుంభకర్ణుడు.. 6 నెలల ముందు నిద్ర లేచారు. వివేకాను హత్య చేసిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడికే జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చారు. హత్య చేసిన వాళ్లను గెలిపించాలని చూస్తున్నారు. ఒక వైపు వైఎస్ఆర్‌ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు. వైఎస్ఆర్‌ మాదిరిగా ప్రజలకు అందుబాటులో ఉంటా” అని ప్రజలకు హామీ ఇచ్చారు.