Saturday, September 28, 2024
HomeUncategorizedతీహార్ జైళ్లో పుస్తకాలు చదవడంపై ఖైదీలు ఆసక్తి

తీహార్ జైళ్లో పుస్తకాలు చదవడంపై ఖైదీలు ఆసక్తి

Date:

కరడుగట్టిన నేరస్తులకు నిలయంగా పేరుగాంచిన తీహార్ జైలు నేడు జ్ఞాన సముపార్జన కేంద్రంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై ఈడీ విచారణను ఎదుర్కొంటూ, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కీలక నిందితులు అందరు జైల్లో ఉన్న సమయంలో పుస్తక పఠనంపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. తీహార్ జైలు కరడుగట్టిన నేరస్తులకు మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జనకు కేంద్రం అన్నట్టుగా, తాము చదువుకోడానికి పుస్తకాలు కావాలని కోర్టుకు ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులు విజ్ఞప్తులు చేస్తున్నారు.

పుస్తక పఠనం చేస్తున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయ్యి ఈడీ విచారణని ఎదుర్కొన్న కవిత ఈడి కస్టడీలో ఉన్నప్పుడు పుస్తకపఠనం చేశారు. స్వామి సర్వ ప్రియానంద రాసిన భగవద్గీతను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత గాధను, అలాగే ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన కె నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను అడిగి తెప్పించుకొని మరీ చదివారు. పుస్తకాలలో చదివిన అంశాలను కూడా కవిత డైరీలో నోట్ చేసుకున్నారు. ఇక తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా వెళుతున్న సమయంలో కూడా తాను చదువుకోవడానికి పుస్తకాలను, రాసుకోవడానికి పెన్నులు, పేపర్లు ఇవ్వాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.

కేజ్రీవాల్ కోరిన మూడు పుస్తకాలు

ఢిల్లీ లిక్కర్ కోణంలో అరెస్టై, ఈడీ విచారణ తర్వాత తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ చదువుకోడానికి ఒక మూడు పుస్తకాలు కావాలని ఢిల్లీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలను జైల్లో చదువుకోవడానికి అనుమతి కావాలని అరవింద్ కేజ్రివాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో 15 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉండబోతున్నారు. రామాయణ, భగవద్గీత లతోపాటు ప్రముఖ జర్నలిస్టు నీరజ్ చౌదరి రాసిన ప్రధానులు కీలక నిర్ణయాలను ఎలా తీసుకుంటారు అన్న పుస్తకాన్ని కూడా ఆయన చదవాలని కోరారు. మొత్తంగా భగవద్గీత వంటి మహా గ్రంథాలను, భారత రాజకీయ చరిత్రలో కీలకమైన పుస్తకాలను తీహార్ జైల్లో కూర్చుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత వంటి నిందితులు ఔపోసన పట్టాలని కోర్టుకు కూడా విజ్ఞప్తి చేసుకున్నారు. అందుకే జ్ఞాన సముపార్జన కేంద్రంగా తీహార్ జైలు మారుతుందేమో అన్న చర్చ ఈ వార్తలతో ప్రధానంగా జరుగుతుంది.