Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంసౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదులో రోబోలు

సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదులో రోబోలు

Date:

ప్రపంచంలోనే ప్రముఖ మసీదుల్లో ఒకటైన గ్రాండ్ మసీదులో ఇప్పుడు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి. సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోలు భక్తుల్ని అబ్బుర పరుస్తున్నాయి. ప్రార్ధనల కోసం మసీదుకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై ఏకంగా 11 భాషల్లో భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి. మసీదులో చాలా చోట్ల రోబోలను ఏర్పాటు చేశారు. ఇవి రంజాన్ మాసంలో మసీదుకు వచ్చే భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి.

గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోల్లో పెద్ద స్క్రీన్ టచ్ ఎల్‌సిడి అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ఆధునిక ఇస్లాం గురించి 11 భాషలలో సమాచారం ఇస్తారు. దీని ద్వారా మసీదు మొత్తానికి ఏ సమాచారమైనా ఏకకాలంలో ఇవ్వవచ్చు. ఈ రోబోల ద్వారా మసీదుకు చేరుకున్న ఎవరైనా ఇస్లాంకు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగవచ్చు. ఈ రోబో ద్వారా మత పెద్దల్ని కూడా ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. మసీదులో అమర్చిన రోబోలు అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ, చైనీస్ మరియు బెంగాలీతో సహా 11 భాషలలో సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఈ భాషల్లో రోబోతో నేరుగా మాట్లాడవచ్చు. రోబోలో 21 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంది.

సౌదీలోని గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోలు కృత్రిమ మేథను వాడుకుని ఆధునిక ఇస్లాంను వ్యాప్తి చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మసీదులోని మతపరమైన వ్యవహారాల అధ్యక్షుడు అబ్దుల్‌రహ్మాన్ అల్ సుదైస్ చెప్తున్నారు.భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మసీదులో ఏఐ వాడుతున్నట్లు ఆయన తెలిపారు. రంజాన్ మాసంలో దీనిని ప్రారంభించాలని, తద్వారా ఉదారవాద ఇస్లాం సందేశాన్ని ప్రపంచానికి అనేక భాషల్లో అందించాలని తమ దేశాధ్యక్షుడు కోరినట్లు ఆయన వెల్లడించారు.